చంద్రబాబు సమైక్యాంధ్ర అనేవారే, మేమే ఆపాం: నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, ఆ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీర్ ఎర్రబెల్లి దయాకర్ రావుపై తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడిన చంద్రబాబు ఒకానొక సందర్భంలో సమైక్యాంధ్రకే తాము కట్టుబడుతామని ప్రకటన చేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లారని, ఆ విషయం తెలుసుకుని తాము అక్కడికి వెళ్లామని, సమైక్యాంధ్ర ప్రకటన చేస్తే తెలంగాణలో పార్టీ ఉండదని నచ్చజెప్పి ఆపామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. చంద్రబాబు నాయుడు తనపై కసి పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ అంశంపై చర్చను పక్కదారి పట్టించడానికి చంద్రబాబు తనపై ఎర్రబెల్లి దయాకర్ రావుతో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన అన్నారు.

ఓ టీవీలో మంగళవారం రాత్రి జరిగిన చర్చలో ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబు ఇంటి నుంచే పాల్గొన్నారని, తాను అడిగిన విషయాలకు చంద్రబాబు చీటీలు పంపిస్తుంటే వాటిని చూసుకుని ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారని ఆయన అన్నారు. చంద్రబాబు పక్కా సమైక్యవాది అని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటారా అని అడిగితే ఎందుకు కట్టుబడి ఉండాలని మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారని ఆయన చెప్పారు. అలా కట్టుబడి ఉంటారా అని అడగడానికి మీరెవరని అడిగారని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చంద్రబాబు పక్కా సమైక్యవాది అని తేలిపోతోందని ఆయన అన్నారు.

తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులకు పెదవులపై తెలంగాణ, హృదయంలో చంద్రబాబు ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యవాదం పేరుతో చంద్రబాబు తెలంగాణ శాసనసభ్యులను బలిపశువులను చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మైనస్‌లో ఉందని, ఆంధ్రలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లుఅనిపిస్తోందని ఆయన అన్నారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డిపై, గాలి జనార్దన్ రెడ్డిపై అలుపెరుగని పోరాటం చేశానని, ఎక్కువ తిడితే ఎక్కువ పైసలు వస్తాయని తాను వారిని తిట్టినట్లు దయాకర్ రావు అంటున్నారని అంటూ ఆ విషయం దయాకర్ రావుకు ఎక్కువ అనుభవంలో ఉన్నట్లుందని ఆయన అన్నారు. దయాకర్ రావు వైయస్ రాజశేఖర రెడ్డి వద్ద ఎక్కువ సమయం, చంద్రబాబు వద్ద తక్కువ సమయం గడిపేవారని ఆయన అన్నారు.

తమ తెలంగాణ నగారాలకు భయపడి చంద్రబాబు తెలంగాణ రణభేరీ సభలు పెట్టిస్తున్నారని, అవి తుస్సుమన్నాయని ఆయన అన్నారు. తన కారుకు, ఇంటికి సంబంధించిన కాగితాలను ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చూపించారు. తమది డాక్టర్ల కుటుంబమని, తాను డాక్టరుగా ఉన్నప్పుడే కార్లు కొనుక్కున్నానని ఆయన అన్నారు. తాను ఇంటికి రుణం తీసుకుని వాయిదాలు చెల్లిస్తున్నానని ఆయన చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి చులకన కావద్దని ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావుకు సూచించారు. చంద్రబాబు కనుసన్నల్లో సమైక్యాంధ్ర కోసం తెలంగాణ ఫోరం నాయకులు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+