గది నిండా బంగారం, డబ్బులు: బాబా మందిరంలో అంతులేని సంపద
State
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నివాసం అయిన యజుర్వేద మందిరంలో అంతులేని సంపద ఉన్నట్లుగా తెలుస్తోంది. భారీగా నగదు, బంగారం నిల్వలు ఉన్నాయి. అదో బంగారు గనిని తలపిస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. పోలీసులు, మీడియాను అనుమతించకుండా గురువారం యజుర్వేద మందిరాన్ని తెరిచిన ట్రస్టు సభ్యులు ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, ఓ బ్యాంకు అధికారి, సత్యసాయి వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌ల ఆధ్వర్యంలో గురువారం నుండి లెక్కింపు ప్రారంభించారు. శుక్రవారం కూడా లెక్కింపు కొనసాగుతుంది. యజుర్వేద మందిరంలోని విషయాలపై ట్రస్టు సభ్యులు ముందు నుండి గోప్యంగా ఉంచుతున్నారు. సాయంత్రం వరకు లెక్కింపు పూర్తి కావచ్చునని, ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రత్నాకర్ కూడా శుక్రవారం అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
మందిరంలో బంగారు వినాయకుడి, కృష్ణుడి విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. లెక్కింపు కోసం నాలుగు కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. బాబాకు ఇష్టమైన ఈ బంగారు విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని ట్రస్టు వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. డబ్బును బ్యాంకు లాకర్లలో పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ ప్రాపర్టీని బాబా బాటలోనే ధార్మిక, సేవ కోసం ఉపయోగించాలని బాబా భక్తులను ట్రస్టు సభ్యులను కోరుతున్నారు.