జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం: మొదట నల్లపురెడ్డిపై!

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనర్హత పిటిషన్‌కు సంబంధించి టిడిపికి, నల్లపురెడ్డి శ్రీనివాస్‌కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం విడివిడిగా నోటీసులు పంపారు. ఈ నోటీసులను ప్రత్యేక దూత ద్వారా రాత్రి 8గంటల సమయంలో టీడీపీకి, నల్లపురెడ్డికి అందజేశారు. అందులో పేర్కొన్న దాని ప్రకారం ఈనెల 27న నల్లపురెడ్డి అనర్హతకు సంబంధించి టీడీపీ తన వాదనను వినిపించాల్సి ఉంటుంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినట్లుగా రుజువు చేయాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. కాగా.. నల్లపురెడ్డి సమక్షంలోనే టిడిపి వాదన జరుగుతున్నపప్పటికీ వినే అవకాశంతప్ప జోక్యం చేసుకునే వీలు అయనకు లేదు.
ఈ నెల 28న తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడంలేదని, టీడీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ చెల్లదంటూ ప్రస్నన్నకుమార్‌రెడ్డి సాక్ష్యాధారాలతో సహా తన వాదనలను వినిపించాల్సి ఉంటుంది. రెండింటినీ సమీక్షించుకుని త్వరలోనే స్పీకర్ తన తీర్పును వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఆ వెంటనే కొండా సురేఖ, అమర్‌నాథ్ రెడ్డి, రావి నారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలతో పాటు టీడీపీ సభ్యుడు బాల నాగిరెడ్డి, పిఆర్పీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డిపై పిటిషన్లపైన విచారించనున్నట్లు సమాచారం.