హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కోపం వచ్చిందంట. కడప జిల్లా సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కడప జిల్లాకు చెందిన కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో మరెవరికీ పదవి ఇచ్చినా సి.రామచంద్రయ్యకు మాత్రం ఇవ్వవద్దని వీరశివారెడ్డి స్పందించారు. వీరశివారెడ్డితో పాటు కడప జిల్లా కాంగ్రెసు నేతలు పలువురు కూడా సి.రామచంద్రయ్యకు పదవి ఇవ్వడంపై విముఖత చూపుతున్నారు.
దీనిపై బొత్స వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయనున్న ఈ సమయంలో అనవసరం రాద్దాంతం సృష్టించ వద్దని వారించినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా నేతలకు ఫోన్ చేసి విలీనం సమయంలో సర్దుబాట్లు ఉంటాయని అలాంటప్పుడు మనం సర్దుకు పోవాల్సిన అవసరం ఉంటుందని వారికి క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. కాగా కడప జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కాంగ్రెసు, పీఅర్పీ మధ్య సమన్వయం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.