కెసిఆర్ నిజాలు మాట్లాడారు: మోత్కుపల్లి నర్సింహులు

మిగతా పార్టీలు రాజీనామా చేస్తే కేవలం ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని ఆయన చెప్పడం అభినందనీయం అన్నారు. కెసిఆర్ ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకుండా తెలంగాణ కోసం మాట్లాడినట్టు కనిపిస్తోందన్నారు. కెసిఆర్‌కు ఇన్నాళ్లూ చిత్తశుద్ది ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేదన్నారు. ఆయన వల్లే తెలంగాణ ఆలస్యమైందని ఆరోపించారు. కెసిఆర్ ఇతర పార్టీలపై బురద జల్లి రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ తెలంగాణ ఇవ్వడానికి టిడిపి అధికారంలో లేదన్నారు. కెసిఆర్ కాంగ్రెసును బలోపేతం చేసే ఉద్దేశ్యం మానుకోవాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచితేనే తెలంగాణ సాధ్యమని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఇవ్వకుంటే కేంద్రాన్ని, రాష్ట్రాన్ని దింపడానికి అవసరమైన రాజకీయ సంక్షోభం సృష్టించడానికి తెలంగాణ టిడిపి సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ కోసం టిడిపి తెలంగాణ నేతలంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రానికి పారామిలటరీ దళాలు వస్తున్నాయంటే కేంద్రానికి తెలంగాణ ఇచ్చే ఉద్దేశ్యం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్నారని ఆయన అన్నారు. అయితే రాజకీయ సంక్షోభం సృష్టించడానికి టి-కాంగ్రెసు ముందుకు వస్తే తాము కూడా సిద్ధమన్నారు. వారు సమయం చెబితే తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి రాజీనామా లేఖలు ఇవ్వడానికి మేం సిద్ధమన్నారు. మూకుమ్మడి రాజీనామాలతోనే తెలంగాణ సాధ్యమన్నారు.
వచ్చే నెల నుండి తెలంగాణ కోసం టిడిపి ప్రత్యక్ష కార్యాచరణలో పాల్గొంటుందని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. జూలై 15 లోపు తెలంగాణలోని పది జిల్లాలో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. జూలై 5న 14ఎఫ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోలన చేపడతామని అన్నారు. జిల్లాస్థాయి సమావేశాలు నిర్వహించిన తర్వాత ఆగస్టు 1న తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గస్థాయిలో ఆందోళన చేస్తాని అన్నారు. తెలంగాణ కోసం వరుసగా టిడిపి ఆందోళనలు చేపడుతుందని చెప్పారు. తెలంగాణను ఏడారి చేస్తున్న బాబ్లీ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు, టిఆర్ఎస్ పార్టీలు కలిసి టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆందోళనలలో వారి ప్రచారాలను కూడా తిప్పి కొడతామని అన్నారు. నిజామాబాద్‌లో త్వరలో తెలంగాణ రణభేరి నిర్వహిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications