హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మిగతా పార్టీల తెలంగాణ ప్రాంత నాయకులకు సూచించారు. రాజీనామాలపై కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గితే ప్రజల్లోకి వ్యతిరేక భావనలు వెళ్తాయని, తెలంగాణ నాయకులు రాజీనామాలకు వ్యతిరేకమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని, అది మంచిది కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
మళ్లీ ఎన్నికలంటూ జరిగితే అది తెలంగాణ రాష్ట్రంలోనే జరగాలని నర్సింహులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా దీనికి కట్టుబడి ఉండాలన్నారు. ఈ నెల నాలుగున రాజీనామాలకు సిద్ధమవుతున్న నేతలంతా దీన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఎన్నికల్లో పోటీ చేయబోమని అమరవీరులస్థూపం వద్ద ప్రమాణం చేయాలన్నారు. ఈ నెల నాలుగున ముందుగా ప్రమాణం చేసి ఆ తర్వాతే స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించాలని ఆయన అన్నారు.