హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఉన్న సెంటిమెంటును తాము గౌరవిస్తామని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంటు బలంగానే ఉందన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని అయితే అధిష్టానాన్నీ తాము గౌరవిస్తామని చెప్పారు. అధిష్టానం అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యుల రాజీనామాలు తప్పు పట్టవలసిన అవసరం లేదన్నారు. వారి ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారు రాజీనామా చేశారన్నారు.
కాగా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినప్పటికీ తాము రాజీనామా చేసేది లేదని హైదరాబాదుకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయం తెలిసిందే. దానం నాగేందర్ తెలంగాణపై ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించక పోవడం విశేషం. రెండు రోజుల క్రితం మాట్లాడుతూ తెలంగాణ వాదినా, సమైక్యవాదినా త్వరలో తన నిర్ణయాన్ని చెబుతానని ప్రకటించారు.