టిడిపితో కలిసే ప్రసక్తే లేదు: బిజెపి నేత కిషన్ రెడ్డి
Districts
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసి పని చేసే ప్రసక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు జి.కిషన్ రెడ్డి మంగళవారం వరంగల్ జిల్లాలో అన్నారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు వరంగల్ జిల్లాలోని వంటావార్పు కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. టిడిపి కపట బస్సు యాత్ర చేస్తుందన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు హైదరాబాదులో కాకుండా న్యూఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇళ్ల ముందు ధర్నా చేయాలని సూచించారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తప్పకుండా ప్రకటిస్తుందని చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ జెఏసిలోకి వస్తే తాము బయటకు వెళ్లి పోతామని కిషన్ రెడ్డి సోమవారం చెప్పిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ ప్రాంతంలోని తొమ్మది జిల్లాలో వంటావార్పు కార్యక్రమం కోసం భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, శాసనసభ్యులు, నేతలు, బిజెపి కార్యకర్తలు, ఐక్యకార్యాచరణ సమితి నేతలు పలుచోట్ల పాల్గొన్నారు.