టిడిపితో కూడా కలిసి పనిచేస్తాం: పొన్నం ప్రభాకర్

కెసిఆర్ కాంగ్రెసు కండువా వేసుకోవడంపై చర్చ జరుగుతోందని, జరగితే మంచిదని ఆయన అన్నారు. రాజకీయాల్లో అన్ని అవకాశాలుంటాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిలాగా ఆంధ్రలో ఓ కండువా, తెలంగాణలో మరో కండువా వేసుకోవాలని చెప్పడం లేదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం అన్ని పార్టీలూ కలుస్తాయని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియను కూడా బుజ్జగింపులు అంటే ఎలా అని ఆయన అడిగారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబును ఖబడ్దార్ అంటూ ఆయన హెచ్చరించారు. సోనియాను విమర్శిస్తే కాంగ్రెసు కార్యకర్తలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తామంతా రాజీనామాలు చేసిన తర్వాత పిలిచి మాట్లాడకపోవడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పు చేశారని ఆయన అన్నారు.