బాబు కళ్లు తెలంగాణ వైపు చూడడం లేదు: నాగం

సీమాంధ్రకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ తెలంగాణవారిని కించపరుస్తున్నారని ఆయన విమర్శించారు. తమను అవమానించిన టిజి వెంకటేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సోనియా, మన్మోహన్ సింగ్ ఫోటోలు పెట్టుకోవడంలో తప్పు లేదని, తెలంగాణ నినాదం వారికి వినిపించాలనేదే అభిమతమని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని లూటీ చేసింది కాక సీమాంధ్ర నాయకులు విజయవాడలో సమావేశం పెట్టుకున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే వారు హైదరాబాదులో సమైక్యాంధ్ర సమావేశం పెట్టాలని ఆయన సవాల్ చేశారు. వారు విజయవాడకే పరిమితమయ్యారని, ఇది సంతోషమని ఆయన అన్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి విజయవాడ రాజధాని కావాలని వారి ఉద్దేశం కావచ్చునని ఆయన అన్నారు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని, సీమాంధ్రలో ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబు కుట్రలో పావులని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. తాము పదవుల కోసం ఉద్యమం చేయడం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే తమ లక్ష్యమని ఆయన శనివారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను రెచ్చగొడితే నష్టపోయేది సీమాంధ్ర నాయకులేనని ఆయన అన్నారు.