ఆజాద్ కోర్టులో తెలంగాణ పంచాయతీ, మీడియాపై నెపం

మధ్యప్రదేశ్, బీహార్ విభజనకు అందరూ అంగీకరించారని, ఆయా రాష్ట్రాలు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు శాసనసభలు కూడా తీర్మానాలు చేశాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదని తాను అన్నానని ఆయన వివరణ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసిందని, వాటిలో దేన్ని కూడా స్వీకరించే పరిస్థితి లేదని, వాటిలో ఏ ఒక్క ప్రతిపాదనపై కూడా ఏకాభిప్రాయం లేదని తాను అన్నానని ఆయన వివరించారు. అందువల్లనే మళ్లీ సంప్రదింపులు అవసరమవుతున్నాయని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందనేది తాను చెప్పలేనని, మూడు ప్రాంతాల ప్రతినిధులతో మాట్లాడుతామని, అలా మాట్లాడి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చూస్తున్నామని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వల్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని తాను అనలేదని ఆయన అన్నారు.
ఇరు ప్రాంతాల నాయకులకు కూడా తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీరించే హక్కు ఉందని, తెలంగాణపై ఇరు ప్రాంతాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయని, అంత మాత్రాన ఇరు ప్రాంతాల నాయకులు పరస్పర దూషణలకు దిగడం మంచిది కాదని అంటూ ఇరు ప్రాంతాల నాయకులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. పరస్పర దూషణల ద్వారా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించవద్దని ఆయన అన్నారు. తెలంగాణ నేతలు కూడా ఢిల్లీకి వస్తారని, తాను జానారెడ్డితోనూ కేశవరావుతోనూ ఫోన్‌లో మాట్లాడానని ఆయన చెప్పారు.
కాగా, కేంద్ర హోం మంత్రి చిదంబరంపై సీమాంధ్ర నాయకులు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. తమ భేటీలో చిదంబరం మాట్లాడిన తీరుపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమాలు ప్రశాంతంగా చేసుకోండని సూచిస్తూ ఆయన రోడ్లపై వంటావార్పూ చేసుకోండని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో సీమాంధ్ర నాయకులు బాధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications