హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తాను నాయకత్వం వహించనని శాసనమండలి సభ్యుడు చుక్కా రామయ్య బుధవారం తేల్చి చెప్పారు. బుధవారం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు చుక్కా రామయ్యను కలిసి తెలంగాణకు నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. దానికి ఆయన సున్నితంగా తిరస్కరించారు. తెలంగాణ సమస్యను ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యగా చూస్తోందని, దీన్ని సామాజిక సమస్యగా చూడాలని చుక్కా రామయ్య ఈ సందర్భంగా కోరారు. రాజీనామాలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. అన్ని పార్టీల నేతలు ఒకే వేదికగా పోరాడాలని ఆయన కోరారు.
కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకుందమని తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ వేరుగా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాల ద్వారానే సాధ్యమని అన్నారు. ఉద్యమానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధం కావాలని కోరారు.