హైదరాబాద్: జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వ్యవహారంలో మరికొన్ని కంపెనీలకు నోటీసులు జారీ చేశామని సిబిఐ ఐజి లక్ష్మీ నారాయణ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటికి 16 కంపెనీలు తమ వాదనలను వినిపించాయని చెప్పారు. తాము కోరిన పత్రాలు అన్ని కంపెనీలు సమర్పించాయని చెప్పారు. ఎమ్మార్ విషయంపై ఉన్నతాధికారులను ప్రశ్నించామని అన్నారు. భూకేటాయింపులకు సంబంధించి రెవెన్యూ, గనులు, ఐటి కార్యాలయాల నుండి ప్రభుత్వ అధికారులను ఆదేశించి మరికొన్ని పత్రాలు తెప్పించుకున్నామని చెప్పారు. వాటి ఆధారంగా విచారణ చేపడుతున్నామన్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన నాలుగు కంపెనీలకు శుక్రవారం నోటీసులు జారీ చేశామని చెప్పారు. శనివారం లోగా దర్యాఫ్తుకు హాజరు కావాలని ఆదేశించినట్లు చెప్పారు.
కాగా సిబిఐ అధికారులు కొందరు ఉన్నతాధికారులను రహస్యంగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి వివరాలను బయట పెట్టేందుకు సుముఖంగా లేనట్లుగా కనిపిస్తోంది. కాగా జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి. భూకేటాయింపుల ద్వారా లబ్ధి పొంది ఎవరెవరు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారనే విషయంపై పూర్తి విచారణ చేస్తోంది. జగన్‌కు చెందిన ఖరీదైన భవనాలపై సైతం సిబిఐ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. బెంగుళూరు, హైదరాబాదు తదితర నగరాలలోని ఆస్తులపై కన్నేసినట్లుగా కనిపిస్తోంది.