తెరాస అధినేత కెసిఆర్‌పై కేసు నమోదు, కోర్టు ఆదేశాలు
Districts
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కృష్ణా జిల్లాలోని చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు నమోదు చేశారు. స్థానిక కోర్టు ఆదేశాలు మేరకు చిలకలపూడి పోలీసులు కెసిఆర్‌పై కేసు నమోదు చేశారు. ఆంధ్రా ప్రాంత బ్రాహ్మణులపై కెసిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్థానికుడు ఒకతను కోర్టుకు వెళ్లాడు. ఆయన పిల్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాదులో టిఆర్ఎస్ చీప్ కెసిఆర్ చండీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన యాగం నిర్వహించారు. ఆ యాగం ముగింపు సమయంలో కెసఆర్ ఆంధ్రా బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తెలంగాణ బ్రాహ్మణులు చిత్తశుద్ధితో పూజలు చేస్తారని, అదే ఆంధ్రా బ్రాహ్మణులు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. దానిపై ఆంధ్రా జనాలు అగ్గిమీద గుగ్గిలం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇందిరాపార్కులో జరిగిన ఎపి బ్రాహ్మణ సంఘంలో కెసిఆర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది.