వైయస్సార్ వర్ధంతి రోజు మరిన్ని రాజీనామాలు?

కాగా, మరో 15 మంది శాసనసభ్యులు వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సెప్టెంబర్ 2వ తేదీన రాజీనామాలు చేయడానికి రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 26 మంది జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. మరో 15 మంది కాంగ్రెసు శానససభ్యులు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం చిక్కుల్లో పడడం ఖాయం. కానీ అది సాధ్యమవుతుందా, జగన్ వర్గం నాయకులు చెప్పేదాంట్లో నిజం ఉందా అనేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతానికైతే 29 మంది శాసనసభ్యులు జగన్ వైపు ఉన్నారు. కాగా, శుక్రవారం శాసనసభ్యుడు మల్లాది విష్ణు తమ కాంగ్రెసు పార్టీపై నిరసన గళం వినిపించారు. వైయస్సార్‌ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. తాను సర్వేలు చేయించానని, రాజీనామాలు చేసిన 26 మంది శాసనసభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో తిరిగి గెలవడం కష్టమని ఆయన చెబుతున్నారని అంటున్నారు. రాజీనామాలు చేసిన శాసనసభ్యులకు వారి మిత్రులతో ఫోనులు చేయించి వెనక్కి రావాలని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ జగన్‌ను శుక్రవారం పలువురు శాసనసభ్యులు కలిశారు. రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, కుంజా సత్యవతి, ప్రసాదరాజు, ఎమ్మెల్సీ శేషుబాబు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లడానికి జగన్ వర్గం నిర్ణయించుకుంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై విరుచుకుపడుతోంది.












Click it and Unblock the Notifications