కాంగ్రెసులో మళ్లీ తెరపైకి కెవిపి రామచంద్ర రావు

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెసుకు దివంగత వైయస్ ఆత్మబంధువుగా రాజకీయాలు బాగా తెలిసిన కెవిపి ఆవశ్యకతను గమనించిన పార్టీ అధిష్టానం ఆయనను ఆదేశించినా లేక తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయనే తెరపైకి వచ్చినా ఇప్పుడు ఆయన అవసరం కాంగ్రెసుకు ఉందనేది పలువురి వాదన. ఇలాంటి సమయంలో ఆయన తెరపైకి వచ్చారు. వైయస్ అసలైన వారసులం మేమే అని చెప్పుకుంటున్న జగన్ వర్గానికి ధీటుగా సమాధానం చెప్పాలంటే కెవిపియే సమర్థుడని పార్టీ సైతం భావిస్తోంది. వైయస్ సన్నిహితుల ద్వారానే వైయస్, జగన్ వేరు వేరు అనే విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్లేందుకు కెవిపి లాంటి వారు ఉపయోగపడతారని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే కెవిపి రెండు రోజుల క్రితం వైయస్సార్ - ది మ్యాన్ ఆఫ్ ది పీపుల్ అనే పుస్తకాన్ని కాంగ్రెసు అతిరథుల మహారథుల ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కెవిపి నిత్యం ప్రజా జీవితంలో ఉంటూ వస్తున్నారు. జగన్‌ను ధీటుగా ఎదుర్కొంటూ కాంగ్రెసు పార్టీని కాపాడేందుకు కెవిపితో సహా వైయస్‌కు సన్నిహితులు అయిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రి వట్టి వసంత్ కుమార్ తదితరులను రంగంలోకి దించుతున్నట్లుగా కనిపిస్తోంది. కెవిపి శుక్రవారం వైయస్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులో హల్ చల్ సృష్టించారు. ఆ తర్వాత విజయవాడలో జరిగే వైయస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో వైయస్ తన ప్రాణ స్నేహితుడి కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటానని అన్నారన్న వ్యాఖ్యలను కూడా గుర్తు చేయడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications