రెచ్చగొట్టొద్దు: ముఖ్యమంత్రిపై తెలంగాణ ఎంపీలు పైర్

ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కళాశాలలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఖండించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ప్రభుత్వం ఆపివేయాలన్నారు. ముఖ్యమంత్రి బెదిరింపు వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు ఉద్యమం నుండి వెనక్కి వెళ్లరని ఎంపీ వివేక్ అన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగం చేశారు. అలాంటిది ఇలాంటి బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. 14ఎఫ్ రద్దు పోరాడి సాధించుకున్నామని అలాగే తెలంగాణ సాధిస్తామన్నారు. తెలంగాణలో పార్టీని బతికించాలంటే తెలంగాణ రావాల్సిందేనన్నారు. నిజాం కళాశాల హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడమేమిటన్నారు.
సకల జనుల సమ్మె ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తీరు రోమ్ నగరం కాలిపోతుంటే ఫిడేలు వాయించినట్లుగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెంటనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసును రక్షించుకోవడానికే తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications