బాబులాగే తెలంగాణను వదిలేసిన వైయస్ జగన్

తీర్మానం ప్రవేశ పెట్టాక మద్దతు పలుకుతానన్న చంద్రబాబు దానికి కట్టుబడి ఉంటే టిడిపికి ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో ఎలాంటి నష్టం వాటిల్లక పోయి ఉండేది. రెండేళ్లుగా నాన్చుడు ధోరణి వైఖరితో వెళుతున్న కారణంగా తెలంగాణలో క్రమంగా టిడిపి వెనుక బడి పోయింది. వెనుకబడి పోయిందనడం కన్నా కనిపించకుండా పోయిందనడమే సమంజసమేమో? ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో టిడిపికి నేతలు తప్ప కార్యకర్తలు లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ అంశంపై బాబు నిర్ణయం ఆలస్యమే పార్టీ దెబ్బతినడానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది. అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు తెలంగాణ విషయంలో ఇప్పటికీ సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో ప్రస్తుతం తెలంగాణలో కార్యకర్తలు లేని పార్టీగా మిగిలిందన్న విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం ముందు ముందు నేతలు సైతం కనిపించని పార్టీగా మిగులుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఇక జగన్ సైతం తెలంగాణ విషయంలో బాబునే ఆదర్శంగా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. బయటకు చెప్పనప్పటికీ ఆయనా రెండు కళ్ల సిద్ధాంతాన్నే నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణపై నేను నిర్ణయం చెబితే పాటించరు కదా. కాబట్టి తానేమీ చెప్పనని అది కేంద్రం నిర్ణయమే అని తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. అయితే అలా చెప్పటం వల్ల తెలంగాణలో ఎలాంటి వ్యతిరేకత రాదని ఆయన భావించి ఉంటారు. కానీ చంద్రబాబు అలాంటి నిర్ణయమే తీసుకొని తెలంగాణలో పార్టీని కనుమరుగు చేసే స్థాయికి తీసుకు వచ్చాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఏదో ఒక నిర్ణయం చెప్పిన పార్టీలను వదిలి ఏ నిర్ణయం చెప్పని పార్టీల వెంటనే తెలంగాణ ప్రజలు పడటం గమనార్హం. అది తెలిసీ జగన్ మళ్లీ అది కేంద్రం నిర్ణయమే అని తమ పార్టీ ఏమీ డిసైడ్ చేయలేదని చెప్పి తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి నింపాడు. సీమాంధ్ర ప్రజల్లో ఎలాగు సమైక్యవాదం అంతగా లేదు. కేవలం నేతలలో మాత్రమే ఉంది. అదీ పెట్టుబడిదారుల నేతలలోనే ఎక్కువగా ఉంది. మరి ప్రజల గురించే తమ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఆయినా, జగన్ అయినా త్వరగా నిర్ణయం తీసుకోకుండా నాన్చడం వల్ల వారికి ఒరిగేదేమీ లేదు. తెలంగాణలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కావడం తప్ప!












Click it and Unblock the Notifications