ఏమిటిదంతా: ముఖ్యమంత్రిపై అధిష్టానం సీరియస్?

తెలంగాణవాదులతో సఖ్యతను ఏర్పరచుకోలేకపోయారని తప్పుబట్టినట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ కూడా అధిష్ఠానానికి ఇదే తరహా నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. తమ తమ ప్రాంతాల మనోభావాలను వెల్లడించే సమయంలో తెలంగాణ ప్రాంత పార్టీ నేతలు వివిధ రకాల వ్యాఖ్యలు చేశారని, వాటిని పట్టించుకున్న ముఖ్యమంత్రి వారితో శత్రువులాగా వ్యవహరించారని అభిప్రాయపడినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి ఆయన బాధ్యత కూడా ఉందని కేంద్రానికి గవర్నర్ నివేదించినట్లు తెలిసింది.
సకల జనుల సమ్మె ఉద్ధృతం కావడానికి ఉద్యోగులతో కానీ, ఇతర వర్గాలతో కానీ సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడకపోవడమే కారణమని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. తెలంగాణ అంశంపై పూర్తి బాధ్యత కేంద్రానిదే అన్నట్లుగా వ్యవహరించకుండా చొరవ తీసుకుని ఆందోళనకారులతో సీఎం మాట్లాడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడినట్లు తెలిసింది. అలాకాకుండా, అంటీముట్టనట్లు ఉండడం వల్లనే రాష్ట్రంలో ప్రభుత్వం లేదనే అభిప్రాయం కలిగిస్తున్నారని గవర్నర్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. వాస్తవానికి, గవర్నర్ ఈ నివేదికను సమర్పించిన తర్వాతనే సమ్మెను విరమింపజేసే బాధ్యతను కోర్ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రిపై పెట్టినట్లు తెలిసింది. దీంతో తాను ఇప్పటికే చాలాసార్లు సమ్మె విరమించాల్సిందిగా ఐకాస నేతలకు విజ్ఞప్తి చేశానని కోర్ కమిటీ సభ్యులకు కిరణ్ చెప్పినట్లు వివరణ కూడా ఇచ్చారట.












Click it and Unblock the Notifications