సోనియా తీరు: తెలంగాణలో కాంగ్రెసుకు చిక్కులు

కాంగ్రెసు పార్టీ 2004లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసి తెరాసతో పొత్తు పెట్టుకుని గెలిచినప్పటి నుంచి గత ఏడేళ్లుగా వ్యవహరిస్తున్న తీరు తెలంగాణలో పార్టీ అంతానికి ఆరంభం మొదలైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణపై ఎప్పటికప్పుడు మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తూ వస్తోంది. కొద్ది కాలం క్రితం వరకు తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో మిణుకుమిణుకుమంటూ వచ్చింది. కానీ, ఇటీవలి కాంగ్రెసు అధిష్టానం పెద్దల ప్రకటనలు, జరుగుతున్న తతంగం వారి ఆశలను పూర్తిగా తుడిచేసింది.
తెలంగాణలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించడం వల్ల పునాదులతో సహా కదిలిపోయింది. ఆ పార్టీ నుంచి కొద్ది శాసనసభ్యులు బయటకు వచ్చినప్పటికీ ఉన్నవాళ్లు తమ తమ నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేని స్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్న తెరాస తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తున్నంత వరకు కాంగ్రెసు పార్టీ నాయకులు ఆనందిస్తూ వచ్చారని చెప్పక తప్పదు. ఇప్పడు కాంగ్రెసు వంతు వచ్చినట్లే చెప్పాలి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెసును కూడా పునాదులతో సహా కదిలించడానికి కెసిఆర్ సిద్ధపడ్డారు. ఆయన 2014 ఎన్నికల వరకు కూడా ఆగడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఏమైనా, సోనియా గాంధీ ముందుకు వచ్చి సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప నిష్కృతి లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications