ఎమ్మెల్యేలతో కలిసి కర్నాటక సిఎం గౌడ శ్రీవారి దర్శనం
National
oi-Srinivas
By Srinivas
తిరుపతి: కర్నాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ మంగళవారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన 33 మందికి పైగా ఎమ్మెల్యేలు శ్రీవారిని దర్శించుకున్నారు. సిఎం సదానంద తన ఎమ్మెల్యేలతో తిరుమల వచ్చి ఉదయం విఐపి ప్రారంభ సమయంలో శ్రీవారి సన్నిధికి వెళ్లి స్వామి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆయన నేరుగా బెంగళూరుకు బయలుదేరారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.
సినీ నటుడు సాయి కుమార్ దంపతులు కూడా ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుచానూరు అమ్మవారి సేవలో పాల్గొన్న సాయికుమార్ దంపతులు విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.