వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై తేల్చని సిఎం సమావేశం

తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రులతో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెనక చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెసు పార్టీ శానససభ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి సీనియర్ మంత్రులతో చర్చలు జరిపారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డితో కలిపి మొత్తం 17 మంది శాసనసభ్యులపై ఎప్పుడు చర్యలు, ఎలా చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చలు సాగాయి.
ఒక్కసారి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే పార్టీలో కూడా క్రమశిక్షణ పెరుగుతుందని కొంత మంది మంత్రులు అన్నారు.తెలంగాణ, సమైక్యాంధ్ర వాదాలకు చెందిన శాసనసభ్యులు, పార్టీ నాయకులు మౌనం వహిస్తున్న స్థితిలో జగన్ వర్గం శాసనసభ్యులపై కూడా చర్యలు తీసుకుంటే పార్టీ గాడిలో పడుతుందని అభిప్రాయపడ్డారు. విప్‌ను ధిక్కరించిన జగన్ వర్గం శానససభ్యులపై చర్యలు తీసుకునే విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విప్ కొండ్రు మురళి నిర్ణయాలు తీసుకుంటారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇది వరకే చెప్పారు. ముఖ్యమంత్రితో జరిగిన సీనియర్ మంత్రుల సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు మహీధర్ రెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications