తెరాస నేత చెరుకు సుధాకర్‌కు ఏడాది పాటు నిర్బంధం

నాసా కింద ఎవరినైనా నిర్బంధిస్తే రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన పనిచేసే సలహా మండలి దీనిని ద్రువీకరించాల్సి ఉంటుంది. సుధాకర్‌ను విడుదల చేయాలంటూ ఆయన సోదరుడు డాక్టర్ విజయబాబు, కుమారుడు సహస్, భార్య లక్ష్మిబాయి, సోదరి వసంత పిటిషన్లు కూడా వేశారు. దీనిపై సీఎస్ పంకజ్ ద్వివేదీతోపాటు జస్టిస్ టీఎల్ఎన్‌రెడ్డి, మరో ఇద్దరు సభ్యులతో కూడిన సలహా మండలి సోమవారం సమావేశమైంది. చెరుకు సుధాకర్ నిర్బంధంపై విస్తృతంగా చర్చించింది. ఆయనపై పోలీసులు చేసిన అభియోగాలతో ఏకీభవించింది. ఆయన నేరపూరిత చర్యలకు దిగే అవకాశాలున్నాయని, ఫలితంగా సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని సలహా మండలి తేల్చి చెప్పింది. "చెరుకు సుధాకర్ సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదు. ఆయనను ఏడాది పాటు నిర్బంధంలో ఉంచాలి'' అని సలహా కమిటీ పేర్కొంది. ప్రభుత్వానికి దీనిపై సూచనలు చేసింది. మంగళవారం మొహర్రం సందర్భంగా సెలవు దినమైనప్పటికీ ప్రభుత్వం ఆగమేఘాల మీద చెరుకు సుధాకర్ నిర్బంధంపై ఉత్తర్వులు జారీ చేసింది. జీవో విడుదల నాటి నుంచి సుధాకర్‌ను ఏడాది పాటు వరంగల్ సెంట్రల్ జైల్లోనే ఉంచుతారు.
టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అక్రమ నిర్బంధాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖండించారు. ఇందుకు నిరసనగా బుధవారం తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకో చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేసీఆర్ పేరిట టీఆర్ఎస్ కార్యాలయం మంగళవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications