సిఎంపై సోనియాకు ఐదుగురు మంత్రుల ఫిర్యాదు?

వైయస్ జగన్‌ను, తెలంగాణ అంశాన్ని ఎదుర్కునేందుకు ఎంతో నమ్మకంతో సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని, అయితే ప్రజలకు, పార్టీకి న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని మంత్రులు ఆ లేఖలో విమర్శించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చకపోతే పార్టీ మనుగడ కష్టమని కూడా వారు ఆ లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాల వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందని వారు చెప్పారని సమాచారం. మంత్రి వర్గ సహచరులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడాన్ని కిరణ్ కుమార్ రెడ్డి చిన్న తనంగా, తన స్థాయికి తక్కువగా భావిస్తున్నారని వారు ఆరోపించినట్లు సమాచారం. ఈ విషయాన్ని తాము పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు చెప్పామని వారు గుర్తు చేసినట్లు తెలుస్తోంది.
రెండు ప్రధానమైన పథకాలను మంత్రులకు కూడా చెప్పకుండా ప్రవేశపెట్టారని, తెలంగాణ అంశాన్నీ జగన్‌ను చూపి రోశయ్యను తప్పు పడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారని, ఆ రెండు అంశాల్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి కూడా విఫలమయ్యారని వారు వివరించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఎదుర్కోవడం లేదని, సోనియాపైనా రాహుల్ గాంధీపైనా జగన్ విమర్శలు చేస్తే ముఖ్యమంత్రి తగిన విధంగా స్పందించడం లేదని, పైగా జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు ఎక్కువ వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారని వారు చెప్పినట్లు సమాచారం. జగన్ వైపు ఐదారుగురు శానససభ్యులు మాత్రమే ఉంటారని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ 16 మంది అటు వెళ్లారని, వారిని కట్టడి చేయడంలో విఫలమయ్యారని వారు చెప్పారు. జగన్‌పై హైకోర్టుకు లేఖ రాసిన మంత్రి పి. శంకరరావును అభినందించడానికి బదులు ముఖ్యమంత్రి మందలించారని వారు చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తున్నారని, మంత్రులు, శాసనసభ్యులు చెప్పిన పనులు ఏవీ జరగడం లేదని, దీంతో శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలవడం కూడా మానేశారని వారు వివరించారు. మొత్తంమీద, కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలోనే ఐదుగురు మంత్రులు సోనియాకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications