వైయస్ జగన్ తెలంగాణ దీక్షపై దండెత్తిన నేతలు

జగన్ పర్యటనను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జగన్ తెలంగాణ వ్యతిరేకి అని, పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారని ఆయన కరీంనగర్‌లో విమర్శించారు. కార్పొరేట్ వ్యాపారం తెలిసిన జగన్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు అనుకూలమని వైయస్ జగన్ కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇవ్వాలని, అప్పుడే తెలంగాణలో జగన్ పర్యటనను అడ్డుకోబోమని కాంగ్రెసు మరో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. సమైక్యవాదుల కుట్రలో భాగంగానే జగన్ తెలంగాణ పర్యటనకు పూనుకున్నారని ఆయన నిజామాబాద్‌లో అన్నారు. చంద్రబాబు, జగన్ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు పోరు బాట, జగన్ దీక్షలు రాజకీయ ప్రయోజనం కోసమేనని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి తన కృష్ణా జిల్లా పర్యటనలో అన్నారు. తమ రాజకీయం తాము చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఆగిపోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications