వైయస్‌పై బాబు వ్యాఖ్య: ఒక్కటైన కాంగ్రెసు, జగన్ పార్టీ

వైయస్ రాజశేఖర రెడ్డిపై చంద్రబాబు నీచమైన భాష ప్రయోగించారని మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పు పట్టారు. విమర్శలు చేస్తే తప్పు లేదని, అయితే స్థాయికి తగినట్లుగా ఆ విమర్శలు ఉండాలని, చంద్రబాబు స్థాయికి తగిన వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబుకు వైయస్సార్ విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. వైయస్సార్ వల్లనే అధికారం కోల్పోయాననే బాధతోనే చంద్రబాబు స్థాయికి తగ్గి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
తాము అధికారంలోకి వస్తే వైయస్సార్ విగ్రహాలను కూలుస్తామని చంద్రబాబు అనడం హేయమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అనుమతి లేకుండా విగ్రహాలు పెడితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని, కానీ చంద్రబాబు అలా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలను అనుమతి లేకుండా ఎన్ని చోట్ల పెట్టారో చంద్రబాబుకు తెలియదా అని ఆయన అడిగారు. వీరేశలింగం విగ్రహం స్థాపించాల్సిన చోట ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పారని, అది కూడా ఎన్టీఆర్ హత్యకు కారణమైనవారేనని, రాజమండ్రి వస్తే అనుమతి లేకుండా ఎన్ని ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టారో చూపిస్తానని ఆయన అన్నారు.
వైయస్సార్ విగ్రహాలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయి వేస్తే ప్రజలు చంద్రబాబును రాజకీయంగా హత్య చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయ నాయకుడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.












Click it and Unblock the Notifications