తెలంగాణకైనా: విస్తరణపై వెనక్కి తగ్గని సిఎం కిరణ్ రెడ్డి

కనీసం తెలంగాణ ప్రాంత నేతలనైనా మంత్రివర్గంలో తీసుకునేందుకు అనుమతివ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారట. ఇటీవల కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులు మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా శంకర రావును బర్తరఫ్ చేశారు. ఈ స్థానాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవే. ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణవాదులు అంటోన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాకపోయినా ఈ నాలుగు స్థానాల భర్తీ కోసమైనా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకోసం ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ వరకే అధిష్టానం అనుమతిస్తే పెద్దగా పోటీ ఉండదు. ఈ ప్రాంతం నుండి యాభై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెసుకు ఉన్నప్పటికీ పదకొండు మంది మాత్రమే సీనియర్లు. వారిలో పదిమంది రెడ్డిలు, ఒకరు దళిత ఎమ్మెల్యే. మెదక్ జిల్లా నుండి ఇప్పటికే ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నందున ఆ జిల్లాకు చెందిన మరొకరికి అవకాశం లేకపోవచ్చు. మర్రి శశిధర్ వంటి సీనియర్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయన ఎన్‌డిఎంఎ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు. నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డియే తెలంగాణ వాదం పేరుతో స్వయంగా తప్పుకున్నారు. హైదరాబాద్ నుండి కూడా ఇద్దరు కేబినెట్లో ఉన్నందున మణెమ్మ, విష్ణువర్ధన్ రెడ్డిలకు అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు. దళితుడైన శంకర రావును బర్తరఫ్ చేసినందున ఆయన స్థానంలో అదే వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications