అటు పట్టు ఇటు బెట్టు: సభ వాయిదా, రేపు రాష్ట్ర బడ్జెట్
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: విపక్షాల పట్టు ప్రభుత్వం బెట్టు మధ్య గురువారం సభ ముచ్చటగా మూడోసారి శుక్రవారానికి వాయిదా పడింది. మద్యం సిండికేట్లపై చర్చించాలని తెలుగుదేశం, తెలంగాణపై చర్చించాలని భారతీయ జనతా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు డిమాండ్ చేశాయి. శాసనసభ్యులు పోడియం వైపుకు దూసుకు పోయారు. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఇదే ఆందోళన కారణంగా సభ మొదటిసారి అరగంట, రెండోసారి పావుగంట వాయిదా పడింది. మూడోసారి కూడా సభ్యుల తీరులో మార్పు లేకపోవడంతో స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ శాసనసభాపక్ష నేతలను తన చాంబరుకు పిలిపించి మాట్లాడారు. శుక్రవారం మొదట గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పిన తర్వాత మద్యం సిండికేట్లపై చర్చిస్తామని స్పీకర్ టిడిపికి సూచించారు. అందుకు వారు ససేమీరా అన్నారు. టిఆర్ఎస్ కూడా తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుపట్టాయి. బిజెపి, లోక్‌సత్తా, సిపిఐలు ఏదో ఒక అంశంపై చర్చించాలని స్పీకర్‌కు సూచించాయి.
కాగా శుక్రవారం మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు సభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. మరోవైపు శాసనమండలిని శుక్రవారానికి వాయిదా వేశారు. మద్యం సిండికేట్లపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. చర్చకు సిద్ధమన్నప్పటికీ టిడిపియే అందుకు వెనుకాడుతోందని ఆరోపించారు. మరోవైపు మద్యం సిండికేట్లపై గవర్నర్‌ను కలవాలని టిడిపి నిర్ణయించుకుంది. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.