హైదరాబాద్: తనకు కాంగ్రెసు శాసనసభా పక్ష ఉప నేత పదవి సాంకేతికంగా సాధ్యం కాదని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం స్ఫష్టం చేశారు. చిరంజీవికి ముందు సీటు కేటాయించేందుకు సిఎల్పీ ఉప నేత పదవి ఇస్తారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి స్పందించారు. తనకు ఉప నేత పదవి అంతా మీడియా సృష్టియేనన్నారు. తనకు ఆ పదవి ఇస్తారనే ప్రస్తావన వచ్చినట్లుగా కూడా తనకు తెలియదన్నారు. సాంకేతికంగా తనకు ఆ పదవి సాధ్యం కాదన్నారు. అలాంటి ప్రతిపాదనే తనకు తెలియదన్నారు. తాను సాయంత్రం జరిగే సిఎల్పీ సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పారు. హాజరు కాకపోవడానికి సాంకేతిక కారణాలే అని అన్నారు. సాయంత్రం జరిగే సిఎల్పీ సమావేశంలో ప్రజారాజ్యం పార్టీ విలీనం ప్రక్రియ పూర్తవుతుందని కాంగ్రెసు చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి వేరుగా మీడియాతో అన్నారు. సమావేశానికి వారు వస్తారా లేదా అనే అంశం సిఎల్పీ నేతగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకుంటారని చెప్పారు.
సిఎల్పీ సమావేశానికి చిరంజీవి హాజరవుతారనే సమాచారం తనకు ఉందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో లాలూచీ పడలేదన్నారు. అవసరాల కోసం బాబే కుమ్మక్కు అవుతారన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి చేసిన జోడు పదవుల వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని అన్నారు.