తెలంగాణ వేడి: కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ పొన్నం

తెలంగాణ సున్నితమైన అంశమని, దాని పరిష్కారం మన చేతుల్లో లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. సిఎల్పీలో అన్ని ప్రాంతాల శాసనసభ్యులున్నారని, ఇక్కడ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం సరి కాదని ఆయన అన్నారు. తాను చెప్తే కేంద్రం వింటుందని అనుకుంటే పొరపాటని, కేంద్రం పలు మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. తాను చెప్పాల్సిందేమిటో సోనియాకు చెప్పానని, ఏం చెప్పాననే విషయాన్ని తాను వెల్లడించబోనని ఆయన అన్నారు. పార్లమెంటు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పాలని ఆయన సూచించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తనకు ఏ ప్రాంతం పట్లా వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు.
రచ్చబండ కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడనాన్ని శానససభ్యుడు విష్ణు వర్ధన్ రెడ్డి ప్రస్తావించారు. జగన్‌ను దీటుగా ఎదుర్కోవడం లేదని కొంత మంది శాసనసభ్యులు ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మధ్య తేడాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ డైరీలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా దామోదర రాజనర్సింహ పేరు రాయకపోవడాన్ని పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు. దళితుడని అలా చేశారా, మరిచిపోయారా ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బొత్స సత్యనారాయణ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. తెలంగాణ, ఆంధ్ర ప్రస్తావన రావడంపై నిరసన వ్యక్తం చేస్తూ సీనియర్ శాసనసభ్యుడు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.