హైదరాబాద్: రాష్ట్రంలోని 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరగడానికి ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టయితే ఏమవుతుందనే ప్రశ్న అన్ని వైపుల నుంచీ వస్తోంది. ఇదే ప్రశ్న మీడియా ప్రతినిధుల నుంచి అన్ని పార్టీల నాయకులకు ఎదురవుతోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఏప్రిల్ 2వ తేదీలోగా సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈలోగానే వైయస్ జగన్ అరెస్టవుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 17 మంది శాసనసభ్యులపై వేటు పడిన నేపథ్యంలో మళ్లీ జగన్ అరెస్టు ప్రచారం ముందుకు వస్తోంది. రాష్ట్రంలోని 17 స్థానాలకు రాష్ట్రపతి ఎన్నికలకు ముందే, అంటే మే, జూన్ నెలల్లోనే ఉప ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈలోగా జగన్ అరెస్టయితే దాని ప్రభావం ఉప ఎన్నికలపై ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
వైయస్ జగన్ అరెస్టయితే ఏమీ కాదని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ అరెస్టయితే రాష్ట్రం అల్లకల్లోలమవుతుందనే ప్రచారంలో నిజం లేదని, ఏమీ కాదని ఆయన అన్నారు. జగన్ అరెస్టయితే ఎలా ఉంటుందనే ప్రశ్నపై జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, కొండా సురేఖ కూడా ప్రతిస్పందించారు. జగన్ అరెస్టయితే తాము సానుభూతితో మరింత ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని కొండా సురేఖ అన్నారు.
వైయస్ జగన్ అరెస్టవుతారనే ప్రచారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అరెస్టవుతారని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి ప్రచారం సాగిస్తున్నారు. వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ ప్రచారంలో పాల్గొంటున్నారని, అందువల్ల వైయస్ విజయమ్మ ప్రచారంలో పాల్గొనబోరని ఆయన చెప్పారు.