జగన్‌కు అన్ని సీట్లలో గెలుపు అంత సులువు కాదా?

ఈ ఉప ఎన్నికల అనంతరం వచ్చే రెండో దఫా ఉప ఎన్నికల్లో జగన్‌కు ఎప్పుడూ అండగా ఉన్న కొండా సురేఖ పరకాల(వరంగల్ జిల్లా) నియోజకవర్గం కూడా ఉంది. అక్కడి నుండి పోటీ చేస్తామని ఇప్పటికే టిఆర్ఎస్, బిజెపి ప్రకటించాయి. కొండా సురేఖ తెలంగాణ కోసం రాజీనామా చేశానని చెబుతున్నప్పటికీ, అది అబద్దమని మిగతా పార్టీలు అంటున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న దృష్ట్యా అక్కడ సురేఖ గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టిఆర్ఎస్, బిజెపి పోటీ చేస్తున్న దృష్ట్యా తెలంగాణవాదులు ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు పలకరని, తెలంగాణవాదులు ఆమెకు అండగా నిలబడని పక్షంలో ఆమె గెలుపు కష్టమేనని అంటున్నారు. ఒకవేళ ఓట్లు సెంటిమెంట్ పరంగా చీలినా విపక్షాలు లబ్ధి పొందుతాయే తప్ప ఆమెకు మాత్రం అది లాభించదని అంటున్నారు. లోకసభలో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్సించిన జగన్ క్షమాపణలు చెబితే తాము బరి నుండి తప్పికుంటామని తెలంగాణవాదులు చెబుతున్నారు. అయితే ఒక్క నియోజకవర్గం కోసం జగన్ క్షమాపణలు చెబితే సీమాంధ్రలోని పదహారు నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బ తినే అవకాశం ఉందని, కాబట్టి జగన్ దానిపై స్పందించక పోవచ్చునని అంటున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూడా జగన్ నేత కాపు రామచంద్రా రెడ్డికి ఎదురు గాలి వీస్తుందని అంటున్నారు. ఆయన పట్ల స్థానికంగా చాలా వ్యతిరేకత ఉందని, అందుకే ఆయన రాజీనామా చేసి అక్కడి నుండి మళ్లీ పోటీ చేసేందుకు వెనుకాడారని, అయితే జగన్ అతనితో చర్చించి, అక్కడ ఆయన విజయానికి పూర్తి సహకారం చేస్తానని హామీ ఇచ్చారట. అందుకే కాపు రాజీనామాకు ఓకె చెప్పి మళ్లీ పోటీకి సై అన్నారట. కాపుపై టిడిపి నుండి అనంత కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. దీపక్ రెడ్డియే గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయట. దీపక్ ఇటీవలె టిడిపిలో చేరారు. పదిహేడు నియోజకవర్గాల్లో తాము కనీసం ఆరు నుండి ఏడు సీట్లు గెలుస్తామని, తెలుగుదేశం కూడా మూడు నాలుగు సీట్లు కైవసం చేసుకుంటుందని కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నాయంట. జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే 17కు పదిహేడు సీట్లను మాత్రం తిరిగి గెలుపొందే అవకాశం లేదని కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నాయంట. ఆయన కేవలం ఆరు నుండి ఎనిమిది సీట్లను మాత్రమే కైవసం చేసుకుంటారని అంటున్నారు. పరకాల తర్వాత రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, ఆళ్లగడ్డ, రాయదుర్గం, ప్రత్తిపాడు, పోలవరం, పాయకరావుపేట, నరసన్నపేట తదితర నియోజకవర్గాల్లోనూ పోటీ రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.