అప్పుడే వేటు పడ్తుందనుకున్నాం: జగన్‌వర్గం బాలినేని
Districts
oi-Srinivas
By Srinivas
|
విజయవాడ: గత సంవత్సరం డిసెంబర్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా విప్ ధిక్కరించి ఓటు వేసినప్పుడే తమపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని భావించామని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాలినేని మాట్లాడుతూ.. విప్ ధిక్కరించిన తమపై వేటు చాలా ఆలస్యమైందన్నారు. తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హులుగా ప్రకటించారని అన్నారు.
సంక్షేమ పథకాల అమలులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పేదలను, రైతులను ఈ ప్రభుత్వం విస్మరించిందన్నారు. రైతులను విస్మరించినందుకే అవిశ్వాస తీర్మానం సమయంలో తాము విపి ధిక్కరించి టిడిపికి ఓటు వేశామన్నారు. వైయస్ జగన్ పైన తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త రఘురామ్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గంలో తొలి విడత పర్యటన 5, 6, 7 తేదీల్లో ఉంటుందని చెప్పారు.