హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకోవడం కాదన్నారు. చిరంజీవికి దమ్ముంటే తమ పార్టీ నేత మేకపాటిపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆ దమ్ము చిరంజీవికి ఉందా అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు, అర్హత చిరంజీవికి లేదన్నారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమన్నారు. జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు నోటీసులు ఇచ్చినా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం తీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 26 జివోలు జారీ చేసిన వారిని వదిలేసి కేవలం జగన్ పైనే సిబిఐ దర్యాఫ్తు చేయడం సరికాదని ఆ పార్టీ సలహాదారు సోమయాజులు అన్నారు. మంత్రులను వదిలేసి జగన్‌ను టార్గెట్ చేయడం సిబిఐ బరితెగింపుకు నిదర్శనం అన్నారు. మంత్రులను, అధికారులను సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు.