మహబూబ్‌నగర్/అదిలాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో మంగళవారం చిన్నపాటి అపశృతులు చోటు చేసుకున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేసిన అనంతరం నాగర్ కర్నూల్ వెళ్లారు. అయితే నాగర్ కర్నూల్‌లో కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగుతున్న సమయంలో ఆ గాలికి ప్రచార సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు కూలి పోయాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అంతకుముందు కొల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణవాదులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అదిలాబాద్ జిల్లాలో చంద్రబాబు పాల్గొన్న సభలోనూ స్వల్ప అపశృతులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు రాకముందు సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు గాలికి కూలిపోయాయి. అయితే టిడిపి కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై బాబు వచ్చేలోగా అన్నింటిని సరి చేశారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతున్న సమయంలో మరోసారి గాలి దాటికి రెండు టెంట్లు కూలి పోయాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. సభ జరుగుతుండగా టెంట్లు కూలడంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది.