సిఎం అయ్యే అర్హత ఉంది, కానీ అభిలాష లేదు: జానారెడ్డి
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: 2014 సాధారణ ఎన్నికల్లో అద్భుతం జరిగితే గానీ కాంగ్రెసు పార్టీ గెలవదని అన్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ వ్యాఖ్యలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి గురువారం వివరణ ఇచ్చారు. 2014లో కాంగ్రెసు పార్టీ తప్పకుండా గెలుస్తుందని చెప్పారు. నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆవేదన చెందారు. అద్భుతం జరిగి కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని తాను చెప్పానని అన్నారు. అద్భుతం జరిగితే తప్ప గెలవదని తాను అనలేదన్నారు. పలువురు నేతలు తన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారన్నారు. తానేం మాట్లాడానో చూడాలన్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమేనన్నారు. 2014లోపు తెలంగాణ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి తాను దూరంగా జరగలేదన్నారు. పరిస్థితి, పార్టీ అవసరాల దృష్ట్యా సంయమనం పాటిస్తున్నట్లు చెప్పారు. మధ్యంతర ఎన్నికలపై వార్తలు అవాస్తవమన్నారు. తనకు సిఎం అయ్యే అర్హత ఉంది కానీ అభిలాష మాత్రం లేదన్నారు.
కాగా బుధవారం జానా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ఏదో అద్బుతం జరిగితే కానీ కాంగ్రెసు పార్టీ గట్టెక్క పోవచ్చునని, అలాంటి అద్భుతం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని అన్న విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెసు పార్టీ నేత కె కేశవ రావుకు మళ్లీ రాజ్యసభ వస్తుందని తాను అభిప్రాయపడుతున్నానని అన్నారు. ప్రభుత్వంలో, కాంగ్రెసులో ప్రస్తుతం ఎవరో ఒకరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. వీటినన్నింటిని అధిగమించి తాము 2014లో వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసును గట్టెక్కిస్తామని చెప్పారు. ఏదో విధంగా తెలంగాణ సాధించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ గెలిస్తే తెలంగాణ సెంటిమెంటుపై రెడ్డి సెంటిమెంట్ గెలిచినట్లేనని అన్నారు.