న్యూఢిల్లీ: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి రాజ్య సభ సీటుపై చివరి నిమిషంలో సస్పెన్స్ ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ చేరుకున్నారు. చిరంజీవి కూడా వెళ్లనున్నారు. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలన్న విషయంలో అధిష్టానం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. చిరుతో మరోసారి మాట్లాడాలని పార్టీ పెద్దలను ముఖ్యమంత్రి కోరారని సమాచారం. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తే తిరుపతి అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుందని.. అక్కడ విజయం సాధించడం అంత సులువు కాదని కిరణ్ చెప్పారని సమాచారం. మరో రెండేళ్లు ఓపిక పడితే 2014లోనే రాజ్యసభ సీటు ఆయనకు ఇవ్వవచ్చునని అంతవరకు ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన హోంమంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆయన సూచించినట్లుగా సమాచారం.
చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే రాజ్యసభ కావాలా లేక హోంమంత్రి పదవి కావాలా లేదా రెండేళ్ల తర్వాత రాజ్యసభ కావాలా అనేది చిరంజీవి తేల్చుకోవాలని ముఖ్యమంత్రి వర్గం నేతలు అంటున్నారట. ఈ వార్తల నేపథ్యంలో చిరు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండిపోయి హోంశాఖను కట్టబెడితే, సబితా ఇంద్రా రెడ్డిని ఆ పదవి నుండి ఉద్వాసన పలికి మరే శాఖ కేటాయిస్తారో!. మరో నేత, ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరికి కూడా సీటు ఇచ్చే విషయంలో అధిష్టానం సుముఖతతో ఉన్నదని, అయితే దీనిపై కూడా వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అయితే శుక్రవారం రాత్రి కల్లా ఏ విషయం ఫైనలైజ్ అయ్యే అవకాశముంది.