ఆరోగ్యశ్రీపై కేంద్రానికి లగడపాటి రాజగోపాల్ డిమాండ్
State
oi-Srinivas
By Srinivas
|
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెసు పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం డిమాండ్ చేశారు. లోకసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, పేదవారి జీవితాలను దుర్భరంగా మారుస్తున్న విషయాన్ని గమనించి కేంద్రం తక్షణం స్పందించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమలుకు ఏటా రెండువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా దీనిని అమలుకు ఇరవై నాలుగు వేల కోట్లయితే సరిపోతుందని అన్నారు. ఆధునిక సదుపాయాలు, పరికరాలేవీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవడంతో పేదలంతా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని తగ్గించేందుకు, పేద ప్రజలకు అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్ర దేశ్‌లో వలె రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు.
కాగా లగడపాటి రాజగోపాల్ రెండు రోజుల క్రితం రాష్ట్రంలో జరిగిన ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికలపై తన సర్వే ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. శ్రీ పొట్టి శ్రీరాములు కొవూరు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, తెలంగాణలోని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు, నాగర్ కర్నూలులో నాగం జనార్ధన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు. అయితే టిఆర్ఎస్, జగన్ పార్టీకి ఓటింగ్ శాతం బాగా పడిపోతుందని చెప్పారు.