హైదరాబాద్: ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం విజయం సాధించిందని మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో దోచుకున్న సొమ్మును కాంగ్రెసు పార్టీ ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిందని, మద్యాన్ని పారించారని, అయినా కొల్లాపూర్‌లో తన విజయాన్ని అడ్డుకోలేకపోయారని, ఇది తెలంగాణవాదం విజయమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెసుకు వేసినా ఫలితం లేకుండా పోయిందని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి టిడిపి ఓట్లను కాంగ్రెసుకు వేయించారని ఆయన అన్నారు.
తెలంగాణవాదాన్ని ప్రజలు బలపరిచారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెసు ముందుకు రావాలని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే సంకేతాలను ఉప ఎన్నికలు ఇచ్చాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.