హైదరాబాద్: ముఖ్యమంత్రి మార్పు, తెలంగాణ అంశాలపై అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి మార్పు అధిష్టానం చేతిలో ఉంటుందని ఆయన అన్నారు. ఎవరో కోరితే ముఖ్యమంత్రిని అధిష్టానం మార్చదని చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చాలని డిమాండ్ చేసినంత మాత్రాన అది జరగదన్నారు. తెలంగాణపై అధిష్టానం త్వరగా తేల్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పైన నిర్ణయం తీసుకోవడంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రాయల తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. త్వరలో రాయల తెలంగాణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ పరిష్కారమవుతుందని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతూ బాధాకరమైన వాతావారణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన చెందారు.
ఉప ఎన్నికల అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం వల్లనే కాంగ్రెసు పార్టీ నష్ట పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం అభ్యర్థులను సాధ్యమైనంత తొందరగా ప్రకటించాలని జెసి దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ క్యాడర్‌కు న్యాయం జరగడం లేదన్న దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. చిరంజీవి వర్గానికి అన్యాయం జరుగుతోందన్న ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని అన్నారు.