మ.నగర్‌లో బిజెపి విన్ చూసి కెసిఆర్ గుర్తించాలి: రేవంత్
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు చోట్ల తెలంగాణ రాష్ట్ర సమితికి, నాగర్ కర్నూలులో నాగం జనార్ధన్ రెడ్డికి మద్దతు పలికిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ మహబూబ్ నగర్‌లో మాత్రం ఓటు ఎవరికి వేయాలో చెప్పలేక పోయారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆదివారం విమర్శించారు. మహబూబ్ నగర్‌లో కోదండరాంది రెండు కళ్ల సిద్ధాంతమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసిన ఇబ్రహీం తెలంగాణవాది కాదా అని ప్రశ్నించారు. ఆరు నియోజకవర్గాలలో ఒక్క సీటు ఓడినా ఉద్యమాన్ని నిలిపి వేస్తామని ప్రగల్భాలు పలికిన తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇప్పుడు మ.నగర్‌లో బిజెపి గెలవడంపై ఏమీ సమాధానం చెబుతారన్నారు.
మీరు చెప్పినట్లు ఇప్పుడు పార్టీని మూసి వేస్తారా అని అన్నారు. ఉప ఎన్నికల్లో తెరాసకు ఓట్లేయాలని కోరిన టిఆర్ఎస్ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అక్కడ బిజెపి గెలిచిన తర్వాత వెంటనే తెలంగాణవాదమే గెలిచిందని కొత్తరాగం పాడారాన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ తెలంగాణ కోసం జెండాలు పక్కన పెట్టాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. మ.నగర్ ప్రజలు అదే చెప్పారన్నారు. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేయాలన్నారు.