తెలంగాణ: కాంగ్రెసు మీద పైచేయికి బిజెపి యత్నం?

మహబూబ్‌నగర్‌లో విజయం సాధించిన తర్వాత తెలంగాణలో బలం పుంజుకోవడానికి అవకాశం ఉందని బిజెపి జాతీయ నాయకులు గుర్తించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ప్రత్యామ్నాయంగా తెలంగాణ నినాదంతో ముందుకు సాగడానికి వీలుందని కూడా వారు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశం లోకసభను కుదిపేస్తున్న తరుణంలో బిజెపి మరో అంశాన్ని ముందుకు తేవడం లేదు. ఆర్మీ చీఫ్ వికె సింగ్ ప్రధానికి రాసిన లేఖపై రాజ్యసభలో దుమారం చెలరేగితే లోకసభలో మాత్రం తెలంగాణ అంశంపై లొల్లి కొనసాగింది. ఈ విషయంలో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ నినాదంపై బిజెపి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు సుష్మా స్వరాజ్ వచ్చారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణ ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. జాతీయ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు తమకు ఉంటుందని, అందుకు కేంద్రంలో తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ తర్వాత వరంగల్ జిల్లా పరకాలలో అదే తరహాలో పోటీకి సిద్ధపడుతోంది. సొంత బలాన్ని సంతరించుకోవడానికి తెలంగాణలో అవకాశాలున్నాయని గుర్తించడమే ఇప్పుడు బిజెపికి ఉత్సాహాన్ని ఇస్తోంది.












Click it and Unblock the Notifications