న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు శుక్రవారం ఢిల్లీలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణ అంశంపై సోనియా, ప్రధాని పెదవి మెదడపటం లేదని విమర్శించారు. తెలంగాణ బిల్లు పెట్టాలని తాము లోకసభలో డిమాండ్ చేస్తున్నామన్నారు. బిల్లు పెడితే తాము అనుకూలంగా ఓటు వేస్తామని కూడా చెప్పామన్నారు. తెలంగాణ కోసం చర్చకు తాము నోటీసులు ఇచ్చామన్నారు. చర్చించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు సభలో తెలంగాణ కోసం పట్టుబడుతున్నా సోనియా, మన్మోహన్ సభలో సైలెంట్‌గా ఉంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రాంతంలోని ఆత్మహత్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున ఓ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ఈ అంశంపై కేంద్రం దాటవేత ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. ఈ అంశం గురించి వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశాలకు ఇదే ఆఖరి రోజు అన్నారు. కీలక అంశాలపై చర్చకు రాకుండా సభను స్పీకర్ వాయిదా వేస్తున్నారని విమర్శించారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం చర్చించకుండా సమావేశాల నుండి పారిపోయిందన్నారు.