టిడిపిలో వారసత్వ పోరు: చంద్రబాబు తప్పిదమేనా?

అయితే, ఎన్టీ రామారావును పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు సమస్యలు వచ్చిన ప్రతిసారీ నందమూరి కుటుంబ సభ్యులను వాడుకుంటూ వస్తున్నారు. సమస్యల పరిష్కారానికి నందమూరి కుటుంబ సభ్యులను వాడుకునే తప్పిదం చేయడం వల్లనే సమస్య ఎప్పటికప్పుడు రగులుతోందని అంటున్నారు. ఎన్టీ రామారావును పదవి నుంచి దించే సమయంలో ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర రావును, హరికృష్ణను దరి చేర్చుకున్నారు. వారి సహకారంతోనే ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారనేది అందరూ అనుకునే మాట.
కాగా, ఆ తర్వాత రాజకీయాల కోసమే బాలకృష్ణతో ఆయన వియ్యమందుకున్నారనే ప్రచారం కూడా సాగింది. ఎన్నికల ప్రచారానికి ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను, బాలకృష్ణను వాడుకున్నారు. అన్న తెలుగుదేశం పార్టీ క్లిక్ కాకపోవడంతో హరికృష్ణ చంద్రబాబు చెంతకు రాగా, దగ్గుబాటి వెంకటేశ్వర రావు రెండు మూడా పార్టీలు మారి చివరకి కాంగ్రెసులో స్థిరపడ్డారు. నారా లోకేష్‌ను రాజకీయాల్లోకి ప్రవేశపెట్టడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలను హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అడ్డుకోవడానికి సిద్ధం కావడంతో బాలకృష్ణను ముందుకు తెచ్చారని అంటారు. ఆ సమయంలో బాలకృష్ణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని చెప్పి, రాజకీయంగా చిరంజీవిపై, ఇతర నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కాస్తా సంచలనం సృష్టించి ఇప్పుడు మాట్లాడడం లేదు. హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను అడ్డుకునే ఎత్తుగడలో భాగంగానే బాలకృష్ణ ముందుకు వచ్చారని అంటారు.
ఇలా ఎప్పటికప్పుడు, చంద్రబాబు నందమూరి కుటుంబ సభ్యులను ముందుకు తేవడం వల్లనే వారసత్వ పోరు రగులుతూ ఉందని చెబుతారు. పార్టీ అధ్యక్షుడిగా ఆ సమస్యలను ఇతరత్రా పరిష్కరించాల్సి ఉండాల్సిందని అంటారు. ప్రస్తుత సమస్యను చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications