జగన్ ఆర్థిక ఉన్మాది, ప్రశ్నిస్తే దాడులా?: రేవంత్‌రెడ్డి ప్రశ్న

revanth reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ దర్యాఫ్తు మహేష్ బాబు దూకుడులా పోతుందనుకుంటే వేణుమాదవ్‌లా జావగారిపోతుందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆదివారం విమర్శించారు. జగన్ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. జగన్ లక్ష కోట్లు సంపాదించారని అందరూ అంటుంటే సిబిఐ మాత్రం కేవలం రూ.ముప్పై వేల కోట్లు అంటూ ఛార్జీషీట్ దాఖలు చేసిందని విమర్శించారు. ఛార్జీషీట్‌లో పొందుపర్చిన జగన్ ఆస్తులు చూసి ఆ పార్టీయే ఆశ్చర్య పోతోందన్నారు. జగన్ ఆస్తుల కేసులో జివోలు జారీ చేసిన మంత్రులను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ ఛార్జీషీట్ కోర్టు ధిక్కారం అవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సోమయాజులు చెబుతున్నారని, ఎలా కోర్టు ధిక్కారమవుతుందో ఆయన చెప్పాలన్నారు.

ఇప్పటి వరకు మనం మతోన్మాదులను తదితరులను చూశామని, కానీ జగన్ మాత్రం ఆర్థిక ఉన్మాది అని మండిపడ్డారు. జగన్ ఆక్రమాస్తులపై ఎవరైనా మాట్లాడితే ఆయన వర్గం ఎదురు దాడి చేస్తుందని ఆరోపించారు. ఆయన మీడియా ఎదురు దాడి చేస్తుందన్నారు. అధికారం అఢ్డు పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించిన జగన్ నీతివంత పాలన ఇస్తానని అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడేందుకు తాను సచివాలయానికి రాలేదని, అధికారులకు ఫోన్ చేయలేదని జగన్ చెబుతున్నారని అంటే ఆయన తన తండ్రి అధికారంలో ఉండి అక్రమాలకు పాల్పడ్డారని ఒప్పుకున్నట్లేనని అన్నారు. జగన్ వితండ వాదం మానాలన్నారు. వైయస్ హయాంలో పరిపాలన ఎక్కడి నుండి జరిగిందో అందరికి తెలుసున్నారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో సిబిఐ జగన్‌ను ఆయన ఇంట్లో విచారించిందా లేక మరోచోట వివరించిందా ఆయన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జగన్ అక్రమాలపై నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు, మీడియా పైనా ఉందన్నారు. ఆయన భజన బృందం ఊరుమీద పడి ప్రజలను ఇబ్బంది పెట్టే బదులు జగనే తాను చేసిన అక్రమాలు అన్నింటిని ఒప్పుకొని కోర్టులో లొంగిపోతే మంచిదన్నారు. ఆయన కోర్టుకు వెళ్లి తప్పులు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందన్నారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో కూరుకు పోయారన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ సంపూర్ణ దృష్టి సారించాల్సి ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల పక్కన అవినీతికి పాల్పడ్డ వైయస్ విగ్రహాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వైయస్ ప్రతి నిర్ణయం వెనుక అవినీతి ఉందన్నారు. చంద్రబాబు ఏ కోర్టులో స్టే తెచ్చుకున్నారో జగన్ చెప్పాలన్నారు. జగన్ అరెస్టు కావాలన్నది తమ డిమాండ్ కాదన్నారు. ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది తమ డిమాండ్ అన్నారు. అక్రమార్కులను అరెస్టు చేయాలన్నారు.

వైయస్సార్ పార్టీ నేత సోమయాజులు పైన కూడా అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. గనులు, జలయజ్ఞం అంశాల పైనా కాగ్ నివేదిక ఇవ్వాలన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ తప్పు పట్టారు. ప్రాథమిక శాఖ మంత్రి అయిన శైలజానాథ్‌కు ప్రాథమిక అవగాహన కూడా లేనట్లుగా ఉందన్నారు. బాబు ఎప్పుడూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోలేదన్నారు. టిడిపి ప్రైవేటే లిమిటెడ్ అవునో కాదో కానీ కాంగ్రెసు మాత్రం దివాళా తీసిన బహుళజాతి సంస్థ. అందుకే ఇక్కడ ఎవరూ లేరని విదేశీయురాలిని తెచ్చుకొని అధ్యక్షురాలిగా చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+