పాతబస్తీలో రాత్రి పూట కర్ఫ్యూ, అంతా ప్రశాంతం

మొత్తం మీద పాతబస్తీలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంది. బుధవారంనాడు పోలీసులు ఐదు గంటల కర్ఫ్యూ ఎత్తివేయడంతో మూడు రోజుల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి వచ్చారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వారు ఎగబడ్డారు. కర్ప్యూ ఎత్తివేసిన సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదు. దీంతో పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు. గురువారంనాడు ఏడు గంటల పాటు కర్ఫ్యూ ఎత్తేశారు.
కర్ఫ్యూ ఎత్తివేసిన సమయంలో పారా మిలిటరీ బలగాలు గట్టి నిఘా పెట్టాయి. హైదరాబాదులోని మాదన్నపేట, సైదాబాద్ ప్రాంతాల్లో ఆదివారంనాడు మతఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పరిస్థితి విషమించింది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కర్ఫ్యూ విధించారు. అప్పటి నుంచి పోలీసులు నిందితుల వేట సాగిస్తున్నారు. అందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఆదివారంనాడు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి పోలీసులు బుధవారం మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారంనాడు ఏడుగురిని అరెస్టు చేశారు. ఆదివారంనాటి సంఘటనల్లో డజను మంది దాకా గాయపడ్డారు. ఓ ప్రార్థనాలయాన్ని అపవిత్రం చేశారనే ప్రచారంతో ఆదివారంనాడు మాదన్నపేట, సైదాబాదుల్లో మత ఘర్షణలు జరిగాయి.
ఈలోగా బహదూర్‌పూరాలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం మతఘర్షణలు చెలరేగిన తర్వాత పాతబస్తీలో అటువంటి సంఘటనలు ఐదు జరిగాయి. దీంతో పాతబస్తీ నిర్మానుష్యంగా మారింది. రోడ్లపైకి రావడానికి కూడా ప్రజలు భయపడ్డారు. బుధవారంనాడు లాడ్ బజార్, పత్తర్‌గట్టి, మదీనా ప్రాంతాల్లో దుకాణాలను తిరిగి తెరిచారు. ఆర్టీసి బస్సులు నడిచాయి.












Click it and Unblock the Notifications