కొండా సురేఖకు చెక్ చెప్పే అభ్యర్థిపై కాంగ్రెస్ తర్జన భర్జన

కేవలం మాచర్ల, పోలవరం, పరకాల నియోజకవర్గ అభ్యర్థుల పైనే కాంగ్రెసు తర్జన భర్జన పడుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ధీటుగా ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలలో పరకాల మినహా అన్నీ సీమాంధ్ర ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో అధిష్టానం పరకాల పైనా దృష్టి సారించింది.
మిగిలిన చోట్ల జగన్‌ను మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంది. కానీ పరకాలలో తెలంగాణ సెంటిమెంట్‌తో పాటు జగన్ అభ్యర్థి కొండా సురేఖను కాంగ్రెసు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ దిశలో కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి, టిడిపి తదితర పార్టీలు అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో కాంగ్రెసు అక్కడి అభ్యర్థిపై వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.
అగ్రవర్ణాల ఓట్లు మిగిలిన మూడు పార్టీలకు చీలుతాయని కాంగ్రెసు భావిస్తోంది. ఇక కొండా సురేఖ బిసి కాబట్టి ఆ దిశలో కాంగ్రెసు దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకట రమణా రెడ్డి తన సతీమణి గండ్ర జ్యోతిని పరకాల నుండి రంగంలోకి దింపేందుకు ఉత్సకత చూపిస్తున్నారు.
జ్యోతి మహిళ కాబట్టి కాంగ్రెసు పార్టీ అధిష్టానం తొలుత సురేఖను ఎదుర్కొనేందుకు ఆమె సరైన అభ్యర్థి అని భావించారట. అయితే జ్యోతి ఓసి కాబట్టి సురేఖను ధీటుగా ఎదుర్కోవాలంటే బిసి మహిళనే రంగంలోకి దింపాలనే వ్యూహంలో కాంగ్రెసు పార్టీ ఉందట. దీంతో జ్యోతి పేరు తెర వెనక్కు వెళ్లి పోయిందని అంటున్నారు. కొండా సురేఖను ధీటుగా ఎదుర్కొనేందుకు బిసి మహిళను రంగంలోకి దింపాలనే ఉద్దేశ్యంతో పార్టీ ఆలోచిస్తుండటంతో మరో పోటీ దారు సమ్మిరావు పేరు కూడా వెనక్కి పోయిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications