లోకసభకు వెళ్లం, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం: కెసిఆర్

కేంద్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి జ్ఞానం, ప్రజల పట్ల స్పృహ లేదని ఆయన విమర్శించారు. తాము ఎంతగా పట్టుబట్టినా ప్రభుత్వం మొండికేసినట్లు వ్యవహరిస్తోందని, లోకసభ సభ్యుల్లో కదలిక వచ్చింది గానీ ప్రభుత్వంలో రాలేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల మధ్యనే ఎండగడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులను గ్రామాల నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కనీసం ప్రభుత్వం స్పందించే స్థితిలో లేదని, లోకసభలో ఎంతగా మొత్తుకున్నా ఫలితం కనిపించడం లేదని ఆయన అన్నారు.
తాము ఆందోళనకు దిగినా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సభ్యుల నుంచి స్పందన రావడం లేదని, సభ నుంచి సస్పెండైన తర్వాత వారు సభకు రావడం లేదని, లోకసభను అడ్డుకుంటే తమను ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. తాము ఆందోళనకు దిగినప్పుడు ప్రధాని గానీ హోం మంత్రి గానీ ఏదో ఒకటి చెప్పవచ్చు కదా అని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమో, అనుకూలమో చెప్పాలని తాము అడుగుతుంటే ఏమీ చెప్పడం లేదని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి వాయలార్ రవి తనతో మాట్లాడారని, తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారని, ఆ విషయమే ప్రధాని గానీ హోం మంత్రి గానీ సభలో చెప్పవచ్చు కదా అని అడిగానని, దాంతో వాయలార్ రవి ఏమీ మాట్లాడలేకపోయారని ఆయన అన్నారు. అంతటి సీనియర్ నాయకుడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని ఆయన అన్నారు. అందరు కలిసి రాష్ట్రపతి వద్దకు వెళ్దామని తెలుగుదేశం తెలంగాణ పార్లమెంటు సభ్యుల సూచనను ప్రస్తావించగా గత పదేళ్లుగా అటువంటివి చాలా చేశామని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి రావాలని, చేయాల్సింది చేయకుండా సమయాన్ని గడిపే ప్రతిపాదనలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి వస్తే తెలంగాణ ఎందుకు రాదో చూస్తామని ఆయన అన్నారు. రాజీనామాలు చేయకుండా పారిపోయారని ఆయన వ్యాఖ్యాంచారు. తమ బలాన్ని పెంచుకుంటామని, తమ ప్రమేయంతోనే భవిష్యత్తులో కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడే విధంగా బలం పుంజుకుని తెలంగాణను సాధించకుంటామని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యుల చేతకానితనం వల్లనే తెలంగాణ రావడం లేదని ఆయన అన్నారు. నిరసన తెలిపితే తెలంగాణ వస్తుందా అని అడిగిన పార్టీల నాయకులను ఉద్దేశించి, - ఏం చేస్తే వస్తుందో చెప్పాలని ఆయన అడిగారు. అందుకే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో డిపాజిట్లు పోతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రులు పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రకటించారని, దాన్ని అమలు చేయకపోవడం పార్లమెంటుకు, కాంగ్రెసు పార్టీకి, ప్రజాస్వామ్యానికి ఏం గౌరవమని ఆయన అడిగారు. పరకాలలో తెలంగాణ జెఎసి అభ్యర్థి పోటీకి దిగడం లేదని, తమ పార్టీ అభ్యర్థినే పోటీకి దించుతున్నామని ఆయన చెప్పారు. మీడియా సమావేశం అనంతరం ఆయన విజయశాంతితో కలిసి హైదరాబాద్ బయలుదేరారు.












Click it and Unblock the Notifications