డిఎల్ రవీంద్రా రెడ్డికి మంత్రి రఘువీరా రెడ్డి కౌంటర్

ఉప ఎన్నికలకు మంత్రులు, పార్టీ నాయకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని రఘువీరా రెడ్డి అన్నారు. జిల్లా మంత్రిగా అనంతపురం జిల్లా ఉప ఎన్నికల బాధ్యత తనపై ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారని చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు.
చంద్రబాబు మాటలకు ఈలలు వస్తాయేమో గానీ ఓట్లు రావని ఆయన అన్నారు. ఒక అబద్ధాన్ని పది సార్లు వల్లిస్తే అదే నిజమవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారని ఆయన అన్నారు. పదేళ్లుగా చంద్రబాబు చేస్తున్న పద ప్రయోగాలు సరిగా లేవని, రోజురోజుకూ చంద్రబాబు దిగజారిపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.
పదవుల కోసం, టికెట్ల కోసం ఢిల్లీ వెళ్లడం కొత్త విషయమేమీ కాదని, చంద్రబాబు ఢిల్లీ వెళ్లకుండానే కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు మంత్రి పదవి తెచ్చుకున్నారా అని ఆయన అన్నారు. ఇతర పార్టీల్లో ముక్కూ ముఖం తెలియనవారికి సీట్లు ఇస్తున్నారని, డబ్బే అర్హతగా చూస్తున్నారని ఆయన అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే ఉప ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల విషయంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు.
గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలు మానేయాలని ఆయన చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ముందు మీ ఇల్లును చక్కబెట్టుకోండని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. తాము అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, దీనిపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications