కాంగ్రెస్‌లో ఉప 'పోరు': చివరి నిమిషంలో మార్పులు

ఏ క్షణంలోనే ఏ మార్పులైనా చోటు చేసుకునే అవకాశముంది. పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు బుధవారం ఎంపీల సమావేశంలో ఇదే విషయం చెప్పారని తెలుస్తోంది. అధిష్ఠానం అభ్యర్థుల జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ఆశావహులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి ఏకంగా తిరుగు బాట పట్టారు. తన సతీమణి గండ్ర జ్యోతికి టిక్కెట్ దక్కడం లేదని తేలడంతో ఆయన తన వర్గం కార్యకర్తలతో సిఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
పాయకరావు పేట టిక్కెట్ సుమనకు కేటాయించడంతో విజయ రావు గాంధీ భవనంలోనే దీక్షకు దిగారు. కడప జిల్లాలో మంత్రులు రామచంద్రయ్య, డిఎల్ రవీంద్రా రెడ్డిలు ఒక వైపు నిలిస్తే, మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీర శివా రెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్రాయుడు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు ఒక బృందంగా ఉన్నారు.
కడపలో అభ్యర్థుల కూర్పుపై డిఎల్ ఫైరయ్యారు. అభ్యర్థుల విషయంలో రాజంపేట ఎంపి సాయి ప్రతాప్ పూర్తి సంతృప్తితో లేరని అంటున్నారు. తిరుపతి అసెంబ్లీ సీటు ఆశించిన మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతుంటే, కమ్మ సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడం పట్ల ఆ వర్గానికి చెందిన నేతల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
ఇక అనంతపురం అర్బన్ నుంచి రషీద్ అహ్మద్‌ను ఎంపిక చేయాలన్న నిర్ణయంపై ముస్లింల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఇలా పలు స్థానాలలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో చివరి నిమిషంలో అభ్యర్థులలో స్వల్ప మార్పులు చేర్పులు జరిగే అవకాశముందని అంటున్నారు. మాచర్ల నుండి పున్నా రెడ్డికి బదులు లక్ష్మా రెడ్డి, పోలవరంలో బొజ్జయ్య దొర స్థానంలో ఓ మహిళను ఇలా కొన్నిస్థానాలలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications